haaram logo

Wednesday, May 25, 2011

హారం లో కనిపించే - 7



చాకిరేవు

రాజకీయ నాయకుల వెర్రి మొర్రి వేషాలనీ, వాళ్ల పోకడలనీ వుతికి ఆరేస్తూ వుంటారు బాబు అనే ఈ బ్లాగరు.

అది కూడా చిన్న చిన్న పద్యాల రూపంలో!

వుతికారంటే, దెబ్బతో తెల్లబడన్నా పోవాలి లేదా చిరిగన్నా పోవాలి. అంతబాగా వుతుకుతారు.

కొంతమంది కొంత పక్షపాతం గా కొంతమందినే వుతుకుతారు అని ఆరోపిస్తారు కానీ, అంత లేదు.

మరి వుతకబడ్డవాళ్లు యెవరైనా చదువుతున్నారో లేదో.

లింకు : http://chaakirevu.wordpress.com/

సూచన : టపాలు కొనసాగించండి. ఇంకా వైవిధ్యంగా ప్రయత్నించండి.

రికమెండేషన్ : అందరూ తప్పక చదవాల్సిన టపాలు. ఈ-మెయిల్ సబ్స్ క్రిప్షన్ పెట్టుకుంటే మంచిది--రోజుకో టపా ఐనా వస్తుంది కాబట్టి.

కొస సూచన : వీలైతే, మీకు తెలిసిన రా నా లకి లింకు పంపించి చదవమనండి.

Tuesday, May 24, 2011

హారం లో కనిపించే - 6



తేట గీతి

సమకాలీన విషయాలమీద ఈ రచయిత (మురళి) వ్రాసే ఈ టపాలు గమ్మత్తుగా వుంటాయి.

సహేతుకంగా విమర్శిస్తూ, చురకలు వేస్తూంటారు.

ముఖ్యంగా, అసలు పేరు వెంటనే స్ఫురించేలా ఈయన తన పాత్రలకి పెట్టే పేర్లు నిజంగా సూపర్బ్!

లింకు : http://tetageeti.wordpress.com/


సూచన : ఇంకా యెక్కువగా తఱచూ వ్రాస్తూండండి. ఇంకా చాలా విషయాలు స్పృశించండి.

రికమెండేషన్ : అందరూ, ఈమెయిల్ ద్వారా సబ్స్ క్రయిబ్ చేసి మరీ, టపా వెలువడగానే చదవండి. వోపికుంటే, కాంప్లిమెంటివ్వండి.

కొస సూచన : సంబంధితులు తప్పక చదివి, యేమైనా మారగలరేమో ఆలోచించాలి!

Thursday, August 12, 2010

హారం లో కనిపించే - 5

అమ్మ ఒడి/టపా కాయ....మొ.వి

(పార్క్ వుడ్ పాపం దేనికి ప్రతిఫలం?)

చాలా మంది లా కాకుండా, మెదడుతో ఆలోచించి, సమస్యని సరిగ్గా గుర్తించి, విశ్లేషించి, ప్రశ్నించి, ఆక్రోశించి, హెచ్చరించే చక్కని టపాలు వ్రాస్తున్న ఓ వుపాధ్యాయురాలు--ఈ అమ్మాయి.

పేరు యడ్ల ఆదిలక్ష్మి.

ఎనోనిమ్ లూ, సూడోనిమ్ లు పెట్టుకొన్నవాళ్లూ వ్రాసే కొన్ని పిచ్చి పిచ్చి బ్లాగురాతలకన్నా, ధైర్యం గా సొంతపేరుతో వ్రాయడం నిజం గా అభినందించదగ్గది.

ఆవిడ లేవనెత్తే విషయాలూ, సందేహాలూ, ప్రశ్నలూ నిజం గా చదవవలసినవాళ్లు చదివితే, తలకాయలు యెక్కడ 
పెట్టుకుంటారో?

అయినా మనకా భయం అక్కర్లేదులెండి--వాళ్లు చదవరు--ఒకవేళ చదివినా, వాళ్ల చర్మాలు చాలా మందం కదా!


సూచన : కృషిని కొనసాగించండి. బ్లాగు లోకానికి మీలాంటివాళ్ల అవసరం చాలా వుంది. యువత కొంతైనా      వుత్తేజితమవుతుందేమో!

రికమెండేషన్ : అందరూ తప్పక చదవాలి, అలోచించాలి, చెయ్యదగ్గదేమైనా వుంటే తప్పక చెయ్యాలి.  

Saturday, August 7, 2010

హారం లో కనిపించే - 4

తెలుగిల్లు

(....ఐన్యూస్ కు తెగులు సోకిందహో!)

"యేమీ రాకపోయినా, ఓ వుద్యోగం సంపాదించి మేమూ ఘనులమే అని మురిసిపోతుంటారు కొందరు.

'హఠాత్తుగా' అని రాయడానికి బదులు 'హటాత్తుగా'అనీ, 'స్థలాని'కి బదులు 'స్థళం'అనీ, 'సగం'కి బదులు 'సహం'అనీ, 'ఛందస్సు'కు బదులు 'చందస్సు'అనీ, 'భేదం'కి బదులు 'బేధం'అనీ, 'మధ్యాహ్నం'కి బదులు 'మద్యాన్నం, మజ్జాన్నం'అనీ, 'జాతీయ'కి బదులు 'జాతియ'అనీ, 'వెళ్తూ' అని రాయమంటే, 'వెడుతూ'అనీ రాసిపారేసి చేతులు దులుపుకునే సీనియర్ ఉపసంపాదకులున్న పాత్రికేయ ప్రపంచం ఇది. చిత్రమేమిటంటే సాహిత్యం గురించి తెలీకున్నా కనీసం ఇంగ్లిష్ పదం 'సిన్సియర్లీ'కి సైతం స్పెల్లింగ్ రాని ఇలాంటి ప్రబుధ్ధులనే పదోన్నతులు వరిస్తుంటాయి. అక్షర దోషాలు లేని పత్రికలే ప్రజాదరణకి నోచుకుంటాయి. పత్రికలలో యెవరి పొరపాటు జరిగినా పాఠకులకు అవి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించి పదాల అర్థాలను మార్చేస్తాయి............"

==> 2002వ సంవత్సరం, జనవరి నెల "విపుల" మాసపత్రిక లోంచి ఈ చిన్న పేరా యదాతథం గా!

మన న్యూస్ రైటర్లూ,ఇంజనీర్లు ఇప్పుడు కూడా అలానే వున్నారు మరి!

వీళ్లకి ద్వా నా శాస్త్రి ప్రశ్నల్లాంటి "పండితరాయలు అంటే యెవరు? ఆయన యే యే కావ్యాలు వ్రాసాడు? వాటిని యెవరెవరికి అంకితమిచ్చాడు?" లాంటి ప్రశ్నలతో పరీక్షించకుండా........... "విష్వక్సేనుడు" లాంటి పదాలతో డిక్టేషన్ ఇచ్చి, కరెక్టుగా వ్రాసినవాళ్లకే వుద్యోగాలంటే.....చచ్చినట్టు దారికొస్తారు!


సూచన  :  కొనసాగించండి!

రికమెండేషన్  :  తెలుగు వాళ్లు, తెలుగు గురించి తపనపడేవాళ్లు చదవ వలసిన ఆంతర్యం!

Friday, August 6, 2010

హారం లో కనిపించే - 3

శిరాకదంబం

సినీ, టీవీ, ఇతర రంగాల్లో పాతికేళ్ల పైగా అనుభవం వున్న SRRao గారి ఆంతర్యం ఇది.

అత్యంత శ్రమకోర్చి, యెక్కువగా మనకందుబాటులో లేని ఆణిముత్యాలని ఒక చోట అందిస్తున్నారు.

వీటిలో అనేక గీతాలూ, గేయాలూ, సంభాషణలూ, ఇతర విషయాలూ కూడా వుంటున్నాయి.

అచ్చు తప్పులూ, వివాదాస్పద విషయాలూ నిల్లు.

అవిశ్రాంతం గా కృషి చేస్తున్నారు.

లింకు : http://sirakadambam.blogspot.com/

సూచన : కొనసాగించండి! (అంతకన్నా కావలసిందేమీ లేదు)

రికమెండేషన్ : తప్పక ప్రతివారూ చూడాలి--భద్రపరచుకోవాలి.

Wednesday, August 4, 2010

హారం లో కనిపించే - 2

PHANI BABU -MUSINGS

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

ఈమధ్య యేమీ తోచనప్పుడు దంపతులిద్దరం అలా స్కూటర్ మీద, (చాలా రోజులయ్యింది వాళ్లింటికి వెళ్లి అనుకుంటూ) పరిచయస్థులెవరి ఇంటికైనా వెళ్లి, కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకొని వద్దామనుకొన్నా, వెళ్లడానికి భయమేస్తోంది!

"ఇక వెళ్లొస్తాం" అని లేవగనే, 'ఒక్క క్షణం' అంటూ వాళ్లు లోపలికి వెళ్లిపోవడం, కాసేపట్లో చేతిలో ఓ పండూ, తమలపాకూ, వక్కా, కుంకుమ భరిణా, వాటి క్రింద (ఫణిగారు చెప్పినట్లు)--పెట్టుబడి బట్టలూ!

"యెందుకండీ ఇవన్నీ....." అంటూ మన నసుగుడూ, "యెప్పుడోగానీ రారు మా ఇంటికి" అంటూ వాళ్ల సమర్థింపూ!

మధ్యతరగతి, యెగువ మధ్య తరగతి లో ఈ జాడ్యం విపరీతం గా పెరిగి పోతోంది.

(ఇదివరకే నా బ్లాగులో, 'వేలం వెఱ్ఱుల్లో' ఒకటిగా దీన్ని గురించి కూడా వ్రాసిన గుర్తు)

ఇదే కాదు, శుభ కార్యాలకే కాకుండా--యెవరైనా పోతే, వాళ్ల అపర కర్మలు కూడా "ఘనం గా" జరిపించడం, వూళ్లో తెలిసున్నవాళ్లందరికీ భోజనాలు పెట్టడం, గోదానం, భూదానం, సువర్ణదానం లాంటివాటికి ప్రత్యామ్నాయం గా ఆ కర్మలు చేయించేవాళ్లు భారీగా దండుకోవడం!

వాళ్లు బ్రతికుండగా కూడు కూడా సరిగ్గా పెట్టారో లేదో తెలియదు గానీ, ఇవి మాత్రం ఘనం గానే చేస్తున్నారు.

ఇదివరకు పంచెల చాపులూ, జామార్లూ అని వుండేవి. ఇప్పుడు అంతా రెడీ మేడ్!


నా సూచన : దాదాపు ప్రతీ రోజూ ఒకటైనా టపాలు వుంచుతున్నారు--కొంచెం పెద్దవి కూడా! మీరు వ్రాసుకొని, ఒక్కో టపాలోనూ కొంత భాగం మాత్రమే ప్రచురించి, మర్నాడు ఇంకోభాగం--ఇలా ప్రచురిస్తే బాగుంటుంది--చదివేవాళ్లు గబగబా చదివేసి, వెంటనే కామెంటెయ్యకుండా, కనీసం ఆలోచిస్తారు.

రికమండేషన్ : పొద్దున్నే కాఫీ తో నంజుకుంటే, భలే వుంటాయి వీళ్ల టపాలు. అందరూ తప్పక చదివి, ఆలోచించవలసినవి.


Tuesday, August 3, 2010

హారం లో కనిపించే

మారుతీయం

మొదటి టపా పూజ్యులు గొల్లపూడివారి ఆంతర్యం తో మొదలు పెడుతున్నాను--ఆయన ఆశీస్సులు వేరే అడగక్కర్లేదు.

తను నమ్మినదాన్ని నిర్భయం గా చెప్పే--రచయితా, జర్నలిస్ట్, బ్లాగర్--ఇంకా చాలా!

"....నాకు కన్నీళ్లు రాలేదు. గుండె పగిలింది. ఆ తల్లి కళ్లల్లో 'అగ్నిని' చూడాలి." లాంటి పదునైన వ్యాఖ్యలతో, 

"అభిరుచి దారిద్ర్యాన్ని' ప్రసారం చేసే టీవీ చానెళ్లకి దిశా నిర్దేశం చెయ్యగల,

బూజు పట్టిన చట్టాలని మార్చమని కోరగల దమ్మున్న వ్యక్తి.



ఆయనకి సూచన : వ్రాతలో లేని కొన్ని మాటలూ, వాక్యాలూ, ఆడియో లో వస్తున్నాయి--దయచేసి, వ్రాతలో కూడా 'రికార్డు' చెయ్యండి!

రికమెండేషన్ : ప్రతీ వాళ్లూ తప్పక చదవ వలసిన, వినవలసిన ఆంతర్యం ఇది.

చదివాక, కనీసం తమ వశం లో వున్న మార్పు యేమయినా చెయ్యడానికి ప్రయత్నించాలి. కనీసం మరో నలుగురికైనా చెప్పి, చదివించాలి.